శ్రీ కపిలవాయి లింగమూర్తి
సాహిత్య ప్రస్థానం

శ్రీ లింగమూర్తి గారు 1928 మార్చి 31 వ తేదిన (ప్రభవ మాఘ శుద్ధనవమి నాడు) పాలమూరు జిల్లాలోని అమరాబాదు తాలుకాలో గల జినుకుంట గ్రామంలో ఒక పండిత వంశమున శ్రీమతి మాణిక్యాంబ వెంకటాచలం గారల గర్భశుక్తిముక్తాఫలంగా జన్మించినారు. అమరాబాదులోని మేనమామ గారైన చేపూరు పెద్దలక్ష్మయ్యగారి దగ్గర పెరిగి విద్యాబుద్ధులు నేర్చి సంస్కృతాంధ్ర నిఘంటువులు, పురాణేతిహాసాలు, కావ్యనాటకాలు, జ్యోతిషశ్రౌతాదిభాగాలు నేర్చినారు.

నాగర్‌కర్నూలులోని 1954 జాతీయోన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా చేరి తరువాత మాస్టర్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ లెర్నింగ్‌ (M.O.L.) మరియు పండిత శిక్షణ కూడ పొందినారు. 1972 నుండి పాలెంలోని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో చరిత్రోపన్యాసకులుగా 13 సంవత్సరాలు నిర్వహించి 1983లో పదవీ విరమణ పొందినారు.

ఒకవైపు ఉద్యోగం నిర్వహిస్తూనే సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలో అనగా పద్యాన్ని, గద్యాన్ని పదునుగా నడిపిన సవ్యసాచి. భావ ప్రకటనకు పద్యం ఏ మాత్రం ప్రతిబంధకం కాదని రమణీయంగా చూపించారు. ఆన్ని సాహిత్య ప్రక్రియలలో అనగా కవితలు, గీతాలు, వచనాలు, శతకాలు, వచన శతకాలు, కావ్యాలు, ద్విపద, నాటకం, ఉదాహరణలు, స్థలచరిత్రలు, బాలసాహిత్యం మొదలగు ప్రక్రియలలో రచనలు చేసిన కవితా కళానిధి. మరుగున పడ్డ తాళ పత్రాలను వెలికి దీసి దానిలోని వ్యాఖ్యా విశేషాలను వివరిస్తూ పరిష్కరించి ఆనాటి తరం కవులను ఈ తరానికి పరిచయం చేసినారు. సాహిత్యంలోని అనేక విషయాలను అవలీలగా వివరించే 'విద్వన్మణి'. అనేక స్థలచరిత్రలు, దేవాలయాల కథలకు ప్రాణం పొసిన 'పరిశోధక పంచాననుడు'.

సాహిత్యంలోని క్లిష్టమైన ప్రక్రియలలో కూడ అనగా చిత్రపది, బంధాలు, శబ్దపది, అలంకారాలు, యతులతో చమత్కారాలు, రచనలు చేపట్టి భాషాసముద్రపులోతుల్లోకి పోయి తెలుగు పలుకుబడిపై ప్రత్యేకాధికారం పొందినారు. జిల్లా అంతా విస్తృతంగా పర్యటించి మరుగున పడిన శాసనాలు, చరిత్ర, జానపదుల నోళ్ళలో నానే అపూర్వమైన, విలువైన విషయాలను గ్రంథస్థం చేసి వేయిపున్నమల వెలుగులో సాహిత్యాన్ని మధించి అక్షరామృతాన్ని కురిపించిన 'కవి కేసరి' ప్రచురించిన గ్రంథాలలో భాగవత కథాతత్వం (భాగవతంలో 10 కథలకు వ్యాఖ్యానం), సాలగ్రామ శాస్త్రం (సాలగ్రామం దానిపుట్టు పూర్వోత్తరాలు, చరిత్ర), పాలమూరు జిల్లా దేవాలయాలు (పాలమూరు జిల్లాలోని వివిధ దేవాలయాల చరిత్ర), శ్రీ మత్ప్రతాపగిరి ఖండం (అమరాబాదు స్థల చరిత్ర), కుటుంబగీత (కుటుంబ నియంత్రణను చాటి చెప్పే ఏకైక కావ్యం), మాంగళ్య శాస్త్రం (మాంగళ్యం ధరించడంలోని గూడార్థాలు, విశేషాలు), దుర్గా భర్గా శతకాలు (అలంకార యతి లక్షణాలు), ఆర్యా శతకం (చిత్ర పద్యాల గారడి), స్వర్ణశకలాలు (90 కావ్యాలలోని స్వర్ణశిల్పి ప్రశస్తి), గీతాచతుష్పథం (భ్రమరగీత, భగవద్గీత, ఉత్తర గీత, ఉద్ధవగీతల సారాంశము), రుద్రాధ్యాయం (సామాజిక చారిత్రక వ్యాఖ్యానం) మచ్చుకు కొన్ని మాత్రమే. పరిష్కృతాలలో యోగాసక్తాపరిణయం (ప్రబంధం) ప్రాచ్యలిఖిత భాండాగారం వారిచే, యయాతి చరిత్ర (అచ్చతెలుగు కావ్యం) తెలుగు యూనివర్సిటీ వారిచే ముద్రింపబడినవి. చాలా పుస్తకాలు తిరుమల తిరుపతి దేవస్థానం మరియు తెలుగు విశ్వ విద్యాలయం ఆర్థిక సహాయంతో వెలుగుకు నోచుకున్నవి. ప్రముఖ ముద్రణా సంస్థలైన ఎమెస్కో పబ్లిషర్స్‌, తిరుమల తిరుపతి దేవస్థానం కూడ వీరి రచనలను ప్రచురించాయి.

దాదాపు ఇంకను 25 విలువైన అముద్రిత గ్రంథాలను వెలికి తీసుకురావలసి యున్నది. వాటిలో పాలమూరు జిల్లా మాండలికాలు (పామర సంస్కృతం), ఆంధ్ర పూర్ణాచార్య చరిత్ర (పరిష్కృతం), హనుమత్‌ సహస్రం (వ్యాఖ్యానం) ముఖ్యమైనవి.

ఉస్మానియా యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, మధురై యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలలో కపిలవాయి లింగమూర్తి పుస్తకాలు సాహిత్యంపై ఆరుగురు రీసెర్చి స్కాలర్స్‌ సిద్ధాంత వ్యాసాలు సమర్పించి డాక్టరేటు పట్టాలు పొందినారు.

తెలుగు విశ్వవిద్యాలయంవారి ప్రతిభా పురస్కారం, బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారం, సి.పి. బ్రౌన్‌ సాహిత్య పురస్కారం, నోరి నరసింహ శాస్త్రి పురస్కారం, కందుకూరి రుద్రకవి పీఠం పురస్కారం, పాల్కురికి సోమనాధ పీఠం పురస్కారం, పులికంటి సాహిత్య సంస్కృతి సన్మానం, తిరుపతిలో తెలుగు ప్రపంచ మహాసభలో పురస్కారం వీరు అందుకున్న పురస్కారాలలో కొన్ని మాత్రమే. గవర్నర్‌ శ్రీ కృష్ణకాంత్‌గారు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుగారు మరియు ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డిగారిచే సన్మానాలు అందుకున్నారు.

ఎందరో ఔత్సాహికులకు శిష్యులకు, మిత్రులకు కవితారంగంలో ఓనమాలు దిద్దించి దశ, దిశా నిర్దేశనం జరిపినారు. ఆశ్రయించిన కవి పండితులకు శబ్దకల్పద్రుమమై ఎందరో విద్యార్థులను కవులుగా, పండితులుగా, కళాకారులుగా తీర్చిదిద్దినారు. ఎందరో యూనివర్సిటీ పరిశోధనా విద్యార్థులకు కూడా మార్గదర్శనం చేసినారు.

మతులు పోగొట్టే యతులు, అలంకార మదగజ కుంభస్థలాలను బద్దలు కొట్టిన లాక్షణికుడు. సాహిత్యం, సంగీతం, సాహిత్యం అనే మూడు విభూది రేఖలను నిత్యం నుదుటిన ధరించే 'కవికుల వైతాళికుడు'. వివిధ శాస్త్రాలలో ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించిన దార్శనికుడు. కవిత్వపు లోతులను తనువెల్లా నింపుకున్న ధీశాలి, నవనవోన్మేషి, నడయాడే విజ్ఞాన సర్వస్వం.